Agriculture Bill of Talk | Agricultur Bill of Uses | Vavssaya bill Challanges | Agricultur Bill Aginest Challenges

Spread the love


వ్యవసాయ బిల్లు పై ప్రజల అలోచన తీరు
__www.smteluguspoorthi.com__

ఏ రకపు సరుకు తయారీ కోసం అయినా, దాని కోసం అవసరమయ్యే ఉత్పత్తి సాధనాల్ని తయారు చేసిన శ్రమలూ, ఆ సాధనాల్ని వాడుతూ తర్వాత జరిగే శ్రమలూ, అన్నీ కలిసినవే కొత్తసరుకు కోసం జరిగే మొత్తం శ్రమలు అవుతాయి. ఆ మొత్తం శ్రమల కాలమే, ఆ కొత్త సరుకుకి విలువ. ఆ విలువని బట్టే, ఆ సరుకుకి ‘ధర’ ఏర్పడాలి. వ్యవసాయ సరుకులకైనా, పెట్టుబడిదారీ పరిశ్రమల సరుకులకైనా, వాటి తయారీకీ, వాటి విలువలకీ, ఒకే రకంగా, అదే సూత్రం.


వ్యవసాయరంగానిక  సంబంధించి కేంద్రప్రభుత్వం ఈ మధ్య కొన్ని చట్టాలు చేసింది. ఆ చట్టాలు వ్యవసాయదారులకు చాలా మేలు చేస్తాయని ప్రభుత్వమూ, చాలా హాని చేస్తాయని రైతు సంఘాల వారూ, వాద వివాదాలతో ఉన్నారు. దాదాపు పదిరోజుల నుంచీ, వేలాదిమంది రైతులు పంజాబునుంచీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌ల నుంచీ ఢిల్లీ చుట్టుపట్లకు చేరి, ఎముకలు కొరికే చలిలో బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు. రైళ్ళు నడవకపోవడం వల్ల, ఢిల్లీకి దూరంగా ఉన్న రాష్ట్రాల రైతులు రాలేక పోయినా, వాళ్ళున్న చోట్లే వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన కొత్త చట్టాల వివరాలనూ, వాటికి సంబంధించిన వాద వివాదాలనూ చర్చించడానికి ఇక్కడ స్థలం చాలదు. అందుచేత, కేవలం ఒకటి రెండు విషయాల గురించి మాత్రమే ఇక్కడ చూడగలం. రైతుసంఘాల నుంచి ముఖ్యంగా వినవస్తున్న డిమాండు ఏమిటంటే, ‘కనీస మద్దతు ధర’ హామీని చట్టంలో చేర్చాలని. ‘కనీస మద్దతు ధర’ అనేది, వ్యవసాయంలో, నాట్లు వేసే కాలానికి ముందే, ఫలానా పంటలకి ఫలానా ధరలు ఇచ్చి కొంటానని ప్రభుత్వం ఇచ్చే హామీ. ఈ హామీ చట్టంలో ఉంటే, ప్రభుత్వం ఆ హామీని అమలు జరపకపోతే, రైతులు కోర్టులకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. 

అందుకే, హామీ అనేది చట్టం ద్వారా జరగాలని రైతుల డిమాండు. ప్రభుత్వం చేసిన కొత్త చట్టాల్లో, వ్యవసాయ సరుకుల మద్దతు ధర విషయాన్ని, రైతులకు ఉన్న హక్కుగానూ, ప్రభుత్వానికి ఉండవలిసిన బాధ్యత గానూ చేర్చలేదు. 

నోటి మాటగా మాత్రమే హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఆ హామీని చట్టంలోనే, స్పష్టంగా ఒక నిబంధనగా పెట్టాలనేది, రైతుల డిమాండ్లలో అతి ప్రధానమైన డిమాండు.


కనీస మద్దతు ధర డిమాండుని సరిగా అర్ధం చేసుకోవాలంటే, అసలు ‘ధర’ అంటే ఏమిటీ, అది ఎలా ఏర్పడుతుందీ, ఇప్పుడున్న పెట్టుబడిదారీ విధానంలో ధరలు ఎలా నిర్ణయమవుతున్నాయి అనే విషయాలు తెలుసుకోవాలి. వాటిని ఇక్కడ అతిక్లుప్తంగా మాత్రమే చెప్పుకోవడం సాధ్యం. పెట్టుబడిదారీ పరిశ్రమల సరుకుల గురించే కాదు, వాటికన్నా వెనకటి కాలపు ఉత్పత్తుల గురించి అయినా అవి ఎలా ఏర్పడతాయో, అది క్లుప్తంగా చూడాలి. ఏ ‘వస్తువు’ గానీ, ఏ పదార్ధం గానీ తయారవడానికైనా, ప్రకృతి సహజ పదార్ధం మీద కొన్ని శ్రమలు జరగవలిసిందే. అతి చిన్న ఉదాహరణ: ఒక మట్టి కుండ. ఇది తయారవ్వాలంటే, మొదట ‘మట్టి’ కావాలి. ‘మట్టి’ అనేది, భూమిలో వున్న సహజపదార్థం. 


భూమినుంచి ‘మట్టి’ని ‘తవ్వే శ్రమ’తో తీస్తే అది, కుండ కోసం ముడి పదార్థంగా, ఒక ఉత్పత్తి సాధనం అవుతుంది. ఇంకా కొన్ని రకాల సాధనాలు కూడా కావలిసిందే. ఏ రకపు సరుకు తయారీ కోసం అయినా, దాని కోసం అవసరమయ్యే ఉత్పత్తి సాధనాల్ని తయారు చేసిన శ్రమలూ, ఆ సాధనాల్ని వాడుతూ తర్వాత జరిగే శ్రమలూ, అన్నీ కలిసినవే కొత్తసరుకు కోసం జరిగే మొత్తం శ్రమలు అవుతాయి. ఆ మొత్తం శ్రమల కాలమే, ఆ కొత్త సరుకుకి విలువ. ఆ విలువని బట్టే, ఆ సరుకుకి ‘ధర’ ఏర్పడాలి. వ్యవసాయ సరుకులకైనా, పెట్టుబడిదారీ పరిశ్రమల సరుకులకైనా, వాటి తయారీకీ, వాటి విలువలకీ, ఒకే రకంగా, అదే సూత్రం.  


తయారైన మట్టికుండ వంటి ఏ కొత్తసరుకుకైనా, దాని ధర, డబ్బు లెక్కతో ఏర్పడుతుంది. ‘డబ్బు’ అనేది, కాయితం నోట్ల లెక్కతో కనపడినా, నిజమైన డబ్బుగా ఉండేది బంగారమే. ఆ బంగారం బైటికి కనపడదు. నిజానికి, మట్టికుండకి ఒక డబ్బునోటుతో అమ్మకం జరిగిందంటే, ఆ కుండకి అణువంత బంగారంముక్కతో మారకం జరిగినట్టు అర్థం. నిజమైన డబ్బుగా ఉండే బంగారం కూడా ఒక వస్తువే. అమ్మకం అయినా, కొనడం అయినా, అది ఒక మామూలు వస్తువుకీ, డబ్బుగా ఉన్న వస్తువుకీ మారకం జరగడమే. 


చలామణీలో కాగితంనోట్లే డబ్బుగా తిరుగుతూ ఉంటాయి. కుండని ఇచ్చి కాగితం డబ్బుని తీసుకుంటే, అది కుండని అమ్మడం. దాన్ని డబ్బు వేపు నుంచి చూస్తే, అది డబ్బు ఇచ్చి కుండని కొనడం. కొత్త సరుకు తయారైపోయి, అది ఒక ‘ధర’ ని పెట్టుకుని, అమ్మకం కోసం బజార్లోకి వచ్చిందంటే, అది కచ్చితంగా, ఆ ధరకే అమ్ముడై పోతుందనేది జరగనూ వచ్చు, జరక్క పోనూ వచ్చు. ఆ సరుకు సప్లై తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా; ఆ సరుకుని కొనేవాళ్ళ డిమాండు తగ్గిందా, పెరిగిందా-అని ఆ సరుకు తాలుకు సప్లై- డిమాండ్ల మార్పుల్ని బట్టి, దాని ధర, అది పెట్టుకున్న దానికన్నా తగ్గవచ్చు; లేదా పెరగవచ్చు. ఈ సప్లై-డిమాండ్ల పరిస్థితులకి కారణం, ఉత్పత్తుల తయారీకి సంబంధించిన స్పష్టమైన ప్లాను సమా జంలో ఉండక పోవడమే. అయితే, ఇప్పుడు రైతుల సమస్య అది కాదు.కేంద్రప్రభుత్వం చేసిన చట్టాల్లో రైతులకు అవసరమైన నిబంధనలేవీ లేవు. రైతులు వాళ్ళ సరుకుల్ని ఎంత దూర ప్రాంతాలకైనా తీసుకుపోయి, ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చునట! ప్రభుత్వం అలా చెపుతోందంటే, రైతులు తమ సరుకుల్ని దూర ప్రాంతాలకి ఎలా తీసుకు పోగలరు? తీసుకుపోవాలంటే, రవాణాకి బోలెడు ఖర్చు; అక్కడ సరుకుని నిలిపి ఉంచడానికి అద్దెల స్తలాల ఖర్చు. అక్కడ సరుకులు మద్దతుధరకే అమ్మకం అవుతాయని గ్యారంటీ ఉండదు. ఒక వేళ అలా అమ్ముడైనా, ఖర్చులన్నిటినీ తీసేస్తే చివరికి రైతుకి మిగిలేదేమీ వుండదు. 


మిగిలేదాన్ని, వడ్డీ-లాభాలుగా భావించే వాదం ఇక్కడ అనవసరం.
బీహారు, ఉత్తరప్రదేశ్ లాంటి వెనకబడ్డ ప్రాంతాల్లో, పెద్ద వర్తకులు, రైతుల దగ్గిర తక్కువ ధరలకే కొని, పంజాబు, హర్యానా వంటి రాష్ట్రాల్లో వాటిని అమ్ముకుని లాభాలు గడిస్తున్నారు. ఆ వర్తకుల దగ్గిర పెట్టుబడి ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి. పేదా, మధ్యతరగతి రైతులకు, పెద్ద వర్తకుల్ని తిరస్కరించే సదుపాయాలు ఉండవు. ప్రభుత్వం తాను చేసిన 3 చట్టాల్లో, 2వ చట్టాన్ని చూపిస్తూ, చేసే వాదం ఏమిటంటే: రైతులు పెద్దపెద్ద వర్తకులతోనూ, వ్యవసాయ సరుకుల మీద ఆధారపడి నడిచే కంపెనీలతోనూ, సాగుకి ముందుగానే, ధరల ఒప్పందాలు చేసుకుంటే, ఆ రైతులకు లాభాలు కురుస్తాయి-అని! ఆ కంపెనీలు, ధరల ఒప్పందాల్ని పాటించక పోతేనట, మధ్యవర్తిత్వం జరిపే బోర్డ్ ఒకటి (‘కన్ సీలియేటరీ బోర్డ్’) ఉంటుందట. అదే ఆఖరు. ఇంక రైతులకు కోర్టులకు వెళ్ళే వీలైతే వుండదు. రైతులు కంపెనీల నించి అప్పులు తీసుకున్న తర్వాత, పంటలకు నష్టం జరిగితే, రైతులకు అప్పులు తీర్చడం కష్టమై, పొలాల్ని, ఆ కంపెనీలకే వదిలేసుకోవాలి. ఇలాంటి ఒప్పందం వల్ల, రైతులు తమ పొలాల్లోనే కూలీలుగా మారాలి. కేంద్రప్రభుత్వం, దేశంలోని రైతు సంఘాలతో చర్చించకుండా, కరోనా సమయంలో హడావిడిగా, తన చట్టాల్ని రైతులకు వ్యతిరేకంగా చేసింది. ఆ చట్టాల్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని రైతుల వాదన. ప్రభుత్వం తమతో విస్తృతంగా చర్చలు జరిపి, కొత్త చట్టాలు చేయాలంటున్నారు రైతులు. వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనడంలో, ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రైవేటు వర్తకులు కూడా ‘కనీస మద్దతుధర’ నియమాన్ని పాటించేలా చట్టం ఉండా లంటున్నారు. ప్రభుత్వం, రైతుల వాదాల్ని చెవిన పెట్టడం లేదు, దానికి చెవులు ఉన్నా! ఎందుకంటే, మద్దతు ధరల కోసం చట్టం అనేది ఉంటే, అది రైతులకు కొంత రక్షణ కావొచ్చుననీ, తనకే వ్యతిరేకం అవుతుందనీ, ప్రభుత్వానికి భయం! ప్రభుత్వం వాదన ఏమిటంటే, ‘ప్రధానమంత్రి మద్దతుధర కోసం పార్లమెంటులో హామీ ఇచ్చారు కదా? హామీ ఉండగా ఇంకా చట్టం ఎందుకూ?’ అట! దీనికి రైతు ఉద్యమకారుల జవాబు ఏమిటంటే: ప్రధానమంత్రి గతంలో చేసిన వాగ్దానాల్ని చూపిస్తున్నారు. ‘పంటల కోసం రైతులకు అయిన ఖర్చులకి తోడు, ఆ ఖర్చుల మీద 50 శాతం లాభం కూడ కలిపితే వచ్చేంత ధర ఇస్తుంది మా ప్రభుత్వం’ అనీ; ‘కోటి ఉద్యోగాలు’ సృష్టిస్తాననీ; విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతీ పౌరుడి ఖాతాలో, ‘15 లక్షలు’ వేస్తాననీ; ఆంధ్రప్రదేశ్‌కి ‘ప్రత్యేక హోదా’ ఇస్తాననీ; ఇలా చాలా వాగ్దానాలు చేసి, చివరికి ఏమి ఇచ్చినట్టు?- అని ప్రశ్నిస్తున్నారు, రైతులు. ప్రభుత్వం ఇచ్చే హామీని నమ్మలేక పోతున్నారు. కనీస మద్దతుధర అనేది కూడా రాక, పేద రైతులూ, మధ్యతరగతి రైతులూ, అప్పులపాలై, ఆత్మహత్యలనే తమ మార్గంగా చేసుకుంటున్నారు. ప్రతీ యేటా, 10 వేలమంది దాకా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లెక్కలు చెపుతున్నాయి. చిన్న స్థాయి రైతులకు ద్రోహం చేసే చట్టాల వల్ల, పొలాలన్నీ పరిశ్రమల దారులకు పోయి, వ్యవసాయం అంతా, భారీ పెట్టుబడిదారీ పరిశ్రమగా మారిపోతుంది. వ్యవసాయాన్ని అలా మార్చాలన్నదే ప్రభుత్వం దృష్టి. 


గిరిజనులు నివసించే అడవుల్లో, భూమి లోపల బొగ్గు వుందనీ, ఆయిలు ఉందనీ, ఇనుము ఉందనీ, ఇంకేదో ఖనిజం ఉందనీ, పెద్దపెద్ద కంపెనీలు సర్వేలు చేసి కనిపెడితే, ఆ భూముల్ని, భారీ పరిశ్రమలుగా మార్చుకోమని పెట్టుబడిదారులకు అప్పజెప్పే ప్రభుత్వం, ఇప్పుడు వ్యవసాయ భూముల్ని కూడా పెట్టుబడిదారులకు అప్పజెప్పే దృష్టితో ప్రయత్నిస్తోఁది. ఈ ప్రభుత్వ ఎత్తుగడ రైతులకు తెలిసినా, తెలియకపోయినా, తమ బతుకుతెరువుల్ని వదులుకోవడానికి రైతులు సిద్ధంగా లేరని, ఇప్పుడు నడుస్తున్న రైతుల ఉద్యమం సూచిస్తోఁది. ఈ రైతుఉద్యమం కనీసపు మద్దతు ధర కోసమే. అంతేగానీ, ‘దున్నేవానికే భూమి’ అనీ, ‘విదేశీ పెట్టుబడుల స్వాధీనం’ అనీ జరిపే వర్గపోరాట విప్లవం ఏమీ కాదు. ఇది కేవలం, కనీసపు ధర కోసమే. రైతుల ఈ ఉద్యమానికి, ఇతర ప్రజలు కూడా సహాయ సహకారాలు అందిస్తూ, మద్దతు తెలుపుతున్నారు. ఇది ఎంతో సంతోషం కలిగించే విషయం. 

www.smteluguspoorthi.com
YouTube.com/TELUGUSPOORTHI

1 thought on “Agriculture Bill of Talk | Agricultur Bill of Uses | Vavssaya bill Challanges | Agricultur Bill Aginest Challenges”

Comments are closed.