Spread the love

Sankranti Festival History Telugu

సంక్రాంతి – పండుగ

భారత దేశం జరుపుకునే పండుగల్లో సంక్రాంతి పండుగ కూడా ఒక పెద్ద పడుగగా జరుపుకుంటారు. వాటి పూర్తి వివరాలు ఎమిటో చూద్దాము. సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం . నక్షత్రాల ఇరువది ఏడు . మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు , మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్నీ 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొకరాశిలో ప్రవేశిస్తాడు . సూర్యుని చలనంలో ( రధయాత్రలో ) ఘట్టాలు నాలుగు .

అవి : మేష , తుల , కటక , మకర సంక్రమణాలు . మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి . సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరింపబడుతుంది . అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి . వీటిలో మకర సంక్రమణాన్ని “ సంక్రాంతి పండుగ ” గా వ్యవహరిస్తారు . అంటే జనవరి 14 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు . హేమంత ఋతువులో , శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది . ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక లలో “ సంక్రాంతి ” అని ; తమిళనాడు లో ” పొంగల్ ” అని , మహారాష్ట్ర , గుజరాత్ లలో ” మకర సంక్రాంతి ” అని , పంజాబు , హర్యానా లలో ” లోరీ ” అని పిలవబడే ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు . మొదటి రోజును భోగి అని , రెండవ రోజును సంక్రాంతి అని , మూడవ రోజును కనుమ అని పిలుస్తారు .

Sankranti Festival History

భోగి కూడలిలో వేయబడే పెద్ద మంట . ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు . ఇంట్లో ఉండే పాత వస్తువులు , చెత్తా , పనికిరాని కర్ర దుంగలూ ఓచోట చేర్చి , భోగి మంటలు వేసి , ఎముకలు కొరికే చలిని తరిమి కొడతారు . దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే , కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు . సాయంత్రం పూట బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు . ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు . ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై , రేగిపళ్ళు , శనగలు , పూలు చెరుకుగడలు , మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు .

బోగి పండ్లు అంటే రేగుపండ్లు . ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండు . సూర్యుని రూపం , రంగు , పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు . సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగిపండ్లు పోస్తారు .

సంక్రాంతి

Sankranti Festival Muggu

రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి , దానితో మిఠాయిలు తయారు చేస్తారు . దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు , బొబ్బట్లు , జంతికలు , సకినాలు , పాలతాలుకలు , సేమియాపాయసం , పరమాన్నం , పులిహోర , గారెలు మొదలయిన వంటకాలు చేసి , కొత్తబట్టలు ధరించి పండుగను ఆస్వాదిస్తారు . ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు . ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి . కాని , మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా , ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు . సంక్రాంతి ముగ్గులకు ఎంతో ప్రత్యేకత ఉంది . రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల , మేఘాలు లేని ఆకాశానికి సంకేతం . ఒక పద్ధతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం . చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం . ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మద్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం .

Sankranti Ganges

సంక్రాంతి అనగానే పిల్లలు ఎక్కువ ఆసక్తి కనబర్చేది . గాలి పటాలు ఎగుర వేయడం . కొత్త సూర్యుడు ఉత్తరాయణ రూపంలో వస్తుంటే మానవమాత్రులమైన మనం అంత ఎత్తుకి వెళ్ళలేం కాబట్టి , మనం ఎగురవేస్తున్న గాలిపటాలు సూర్యునికి స్వాగతాన్ని పలుకుతాయనడానికి సంకేతం . అవి ఎగురుతున్న విధానం , గాలి ప్రవాహం , పారుదల ఎటుందో తెలుసుకోడానికి సంకేతం .

Sankranti Ganges

సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం .. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు . ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మభద్దమైనదని అర్ధం . చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ , డోలు , సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి . ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు . అయ్యగారికి దండం పెట్టు , అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తూ కొత్తగా వచ్చిన ధాన్యాన్ని అడుక్కుంటారు . మీరు చేసే దానమంతా ధర్మభద్దమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు .

కనుమ

దీన్నే పశువుల పండుగ అని అంటారు . తమ చేతికొచ్చిన పంటను తామేకాక , పశువులూ , పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు . పల్లెల్లో పశువులే గొప్పసంపద , అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం .

మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు . కనుమ నాడు మినుము తినాలనేది సామెత . దీనికి అనుగుణంగా , ఆ రోజున గారెలు , ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ . కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు . దీనికి బొమ్మల పండుగ అని పేరు .

ఇంతటినుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు . ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో , కళకళలాడుతూ , ” సంక్రాంతి లక్ష్మీ ” ని ఆహ్వానిస్తూ ఉంటాయి . గొబ్బెమ్మల పూజ , గంగిరెద్దుల హడావుడి , హరిదాసుల రాకడ , కోడిపందాలు , ఎడ్లపందాలు , బంతిపూల తోరణాలు , కొత్త జంటల విహారాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి . ఇంత చక్కని ఆనందాన్నీ మనకు అందించే ” సంక్రాంతి ” పండుగలు మనం జరుపుకుని , మహారాణిలావచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం . అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు .

తెలుగు స్పూర్థి

ఏస్.ఏం.తెలుగు స్పూర్థి