Panchatantra StoriesPanchatantra Stories
Spread the love

Panchatantra Stories

Hiranyaksha History in Panchatantra

హిరణ్యకుడి కథ

గమనిక: ఇందులో నీతి ఏమిటో తెలుసుకోండి మీ జీవితంలో కూడా ఎదురవచ్చు

Hiranyaksha History : ఒక రోజు హిరణ్యకుడూ, లఘుపతనకుడూ కబుర్లలో పడ్డారు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుకోసాగారు. ‘‘ రోజు రోజుకూ ఇక్కడ తిండి దొరకడం కష్టంగా ఉంది. వేరే చోటుకు వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటావు? ’’ అని అడిగాడు లఘుపతనకుడు. ‘‘ బాగుండదేమో! పళ్ళకూ, జుట్టుకూ, గోళ్ళకూ, మనుషులకూ ఉన్న చోట ఉంటేనే బాగుంటుంది. స్థాన బలిమి ఉంటుంది. మారితే బలం తగ్గిపోతుంది. ’’ అన్నాడు హిరణ్యకుడు.

‘‘ అదంతా బలహీనుల విషయంలో. శారీరకంగా, మానసికంగా బలమైనవాళ్ళు ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటుంది. ఏనుగులూ, సింహాల్నీ చూడు. అవి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ హాయిగా, ఆనందంగా ఉండట్లేదూ? అలాగే మనమూ! యేళ్ళకేళ్ళు ఉన్న చోటే ఉండడం ప్రమాదం కూడాను. ’’ అన్నాడు లఘుపతనకుడు. ‘‘ నీకిక్కడ ఉండాలని లేదు. ఆ సంగతి తెలుస్తోంది. ఎక్కడికి వెళ్ళాలని నీ ఉద్దేశం? ’’

‘‘ ఎక్కడికంటే, దండకారణ్యం ఉందా? అక్కడ కర్పూరగౌరం అని ఓ చెరువు ఉంది. ఆ చెరువులో మంథరుడు అనే తాబేలు ఉంది. అతను నాకు మంచి మిత్రుడు. మంచివాడు. బుద్ధిమంతుడు. ఇతరులకు ఎన్నైనా నీతులు చెప్పవచ్చు. వాటిని మనం ఆచరించాలంటే కష్టం. అయితే మంథరుడు తను నీతులు చెప్పడమే కాదు, వాటిని ఆచరించి చూపుతాడు. పైగా దయా ధర్మపరుడు.

అతనితో ఉన్న రోజుల్లో నాకొక్కొక్కసారి తిండి దొరికేది కాదు. అప్పుడు మంథరుడు ఏం చేసేవాడంటే, తాను పట్టుకున్న చేపల్నే నాకు కొన్ని పెట్టి ఆదరించేవాడు. పదే పదే గుర్తుకొస్తున్నాడిప్పుడు. అతని దగ్గరికి వెళ్ళిపోదామనిపిస్తోంది. ’’ అన్నాడు లఘుపతనకుడు. ‘‘ నువ్వు వెళ్ళిపోతే నేనేం కావాలి. గౌరవం లేని చోటా, తిండి దొరకని చోటా, బంధు మిత్రులు లేని చోటా ఉండకూడదంటారు. అందుకని, నేనూ నీతోపాటు వచ్చేస్తాను. పద! ’’ అన్నాడు హిరణ్యకుడు. తనతోపాటు హిరణ్యకుడు వస్తానంటే లఘుపతనకుడి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ‘‘ నిజంగా వస్తావా! ’’ అని అడిగాడు లఘుపతనకుడు. ‘‘ నిజంగానే వస్తాను. పద! ’’ అన్నాడు హిరణ్యకుడు.

ఇద్దరూ బయల్దేరారు. దారిలో దొరికినవి తింటూ, కబుర్లాడుకుంటూ ప్రయాణించారు. కొన్నాళ్ళకు మంథరుణ్ణి చేరారు. దూరం నుంచే లఘుపతనకుణ్ణి చూసి, పొంగిపోయాడు మంథరుడు. తోడుగా వచ్చిన హిరణ్యకుణ్ణి చూసి కూడా సంతోషించాడు. ఇద్దరికీ అతిథి మర్యాదలు చేశాడు. ‘‘ హిరణ్యకుడు అని ఇతను ఎలుకల రాజు. మంచివాడు. ’’ అని మంథరునికి హిరణ్యకుణ్ణి పరిచయం చేశాడు లఘుపతనకుడు. ‘‘ రాజువైతే ఊరిలో ఉండాలి. అరణ్యంలో ఉండడమేమిటి? అడుగుతున్నానని ఏమీ అనుకోకపోతే అడవిలో ఎందుకుంటున్నావు? ’’ అని హిరణ్యకుణ్ణి అడిగాడు మంథరుడు. ‘‘ ఎందుకుంటున్నానంటే, ’’ అంటూ తన కథను ఇలా చెప్పుకొచ్చాడు హిరణ్యకుడు.

‘‘ అప్పట్లో నేను చంపకవతి అనే పట్టణంలో ఉండేవాణ్ణి. ఆ పట్టణంలో నాలాంటి ఎలుకలే కాదు, సన్యాసులు కూడా ఎక్కువగా ఉండేవారు. చూడాకర్ణుడు అని ఓ సన్యాసి ఉండేవాడక్కడ. అతను భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజన పదార్థాల్ని ఓ గిన్నెలో పెట్టి, దాన్ని ఉట్టిలో పెట్టి నిద్రపోయేవాడు. అతనలా నిద్రపోగానే నేనిలా ఆ ఉట్టిని అందుకొని, గిన్నెలోకి ప్రవేశించి, అందులోని భోజన పదార్ధాలన్నీ తిని త్రేన్చేవాణ్ణి. ఇది గమనించాడు చూడాకర్ణుడు. నన్ను కర్రతో బెదిరించసాగాడు.

ఒక నాడు, వీణాకర్ణుడనే చూడాకర్ణుని మిత్రుడు వచ్చాడక్కడికి. అతనితో మాట్లాడుతూ, మధ్య మధ్యలో కర్రను నేలకు తాటిస్తూ కూర్చున్నాడు చూడాకర్ణుడు. పదే పదే కర్రను నేలకు తాటించి చూడాకర్ణుడు పెద్దగా శబ్దం చేయడం వీణాకర్ణునికి అంతు చిక్కలేదు. ‘ ఏంటయ్యా ఈ గోల! ’ అని అడిగాడు వీణాకర్ణుడు. ‘ ఏం చెప్పమంటావు! ఈ గదిలో ఓ ఎలుక తిరుగుతోంది. నేను అదిగో ఆ ఉట్టిలో దాచిపెట్టుకున్న నా భోజన పదార్ధాలను తినేస్తోంది. పెద్ద బెడదైపోయింది దాంతో. ’ అన్నాడు చూడాకర్ణుడు.

ఉట్టి చాలా ఎత్తులో ఉంది. దాన్ని ఎలుక అందుకోవడమేమిటి? అని ఆశ్చర్యపోయాడు వీణాకర్ణుడు. ‘ ఉట్టి మీదికి ఎలుక ఎగురుతోందా? నీ భోజన పదార్ధాల్ని తినేస్తోందా? ఆశ్చర్యంగా ఉందే! ఇంత చిన్న ఎలుక,అంత ఎత్తున ఉన్న ఉట్టి అందుకుంటోందంటే, ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే! ’ అన్నాడు వీణాకర్ణుడు.

ఎప్పుడో జరిగిన సంఘటన ఒకటి అతనికి చప్పున గుర్తుకు వచ్చింది. దాన్ని చెప్పసాగాడిలా. ‘ ఆ మధ్య నేను రోజూ ఓ బ్రాహ్మణుని ఇంటికి భిక్షకు వెళ్ళేవాణ్ణి. ఓ రోజు నేను భిక్షకు వెళ్ళిన వేళ, ఆ బ్రాహ్మణుడు భార్యతో ఇలా అనడం వినిపించింది. ‘ ఇదిగో! రేపు అమావాస్య. సాటి బ్రాహ్మణులకు ఇంత అన్నం పెడితే పుణ్యం. ఏం వండుతున్నావు? ’ అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు. ‘ ఏం వండను? ఉంటే వండిపెడతాను. లేని దానికి ఏం వండను? ’ అని అడిగింది అతని భార్య. ఆ ఇంట అన్నీ నిండుకున్నాయి. ఆ విషయంలో ఆమె చాలా కోపంగా ఉంది. ‘ ఉంటే ఎవరైనా వండి పెడతారు. లేనప్పుడు వండి పెట్టడమే గొప్ప. ఉన్నదానితోనే ఏదో ఒకటి వండి పెట్టు. అంతేగానీ, అది లేదు, ఇది లేదంటూ రాగాలు తీయకు. ’ అన్నాడు బ్రాహ్మణుడు. తన భార్య ఇంట్లో లేమిని ఎత్తి చూపడాన్ని అతను తట్టుకోలేకపోయాడు. ‘ సరే! రాగాలు తీయను. ఉన్నదానితోనే వండి పెడతాను. ’ అన్నదామె.ఇంట్లో నువ్వులు మాత్రమే ఉన్నాయి. వాటితోనే ఏదో చేసి, నలుగురు బ్రాహ్మణులకూ పెడదామని, నువ్వుల్ని కడిగిందామె. దంచింది. ఎండబోసింది. ఎండబోసిన నువ్వుల్ని చూసి కోడి వచ్చిందక్కడికి. కాళ్ళతో వాటిని కెలికి, చెల్లాచెదురు చేసింది.

బ్రాహ్మణుని భార్య అది చూసింది. అయ్యో అనుకుంది. కోడి కెలికిన నువ్వులు వంటకు పనికిరావు. అవి మైలపడినట్టే! ఇప్పుడేం చెయ్యాలి? అని భర్తను అడిగింది. ‘ చుట్టు పక్కల మార్చి చూడు. తెలివితేటలు ప్రదర్శించు. ’ అన్నాడు భర్త. భార్య పక్కింటికి వెళ్ళింది. ఆ ఇంటి ఇల్లాలిని పిలిచి, ఇలా అడిగింది. ‘ కడిగి, దంచి, ఎండబోసిన ఈ నువ్వులు తీసుకొని, ముడి నువ్వులుంటే నాకివ్వండి. ఎంతో మేలు చేసినవారవుతారు. ’ అని అడగడమే ఆలస్యం! ఆ ఇల్లాలు ముడి నువ్వులిచ్చేందుకు సిద్ధపడింది. గమనించాడది ఆ ఇల్లాలు భర్త. ఇలా అన్నాడు. ‘ కడిగి, దంచి, ఎండబోసిన నువ్వులు నీకిచ్చి, ముడి నువ్వులు అడుగుతోందంటే ఇందులో ఏదో తిరకాసుంది. అడిగి తెలుసుకో. ’ ఆమె అడిగి తెలుసుకుందో లేదో నాకు తెలియదుగానీ, నేనప్పణ్ణుంచీ ఓ నిజం తెలుసుకున్నాను. ఏ పనికైనా ఏదో ఒక కారణం ఉంటుంది.

కారణాన్ని కనుక్కోవాలి. విషయానికి వస్తే, ఒక చిన్న ఎలుక నిన్నింతలా ఇబ్బంది పెడుతూ, అంతెత్తున ఉన్న ఉట్టికి ఎగురుతోందంటే ఏదో కారణం ఉంది. దాన్ని కనుక్కోవాలి. అంతేగానీ, కర్రను కొడుతూ కూర్చుంటే లాభం లేదు. ’ అన్నాడు వీణాకర్ణుడు. వీణాకర్ణుడు చెప్పింది నిజమే! ఏదో బలమైన కారణం ఉంది. అనుమానం లేదనుకుంటూ ఆలోచనలో పడ్డాడు చూడాకర్ణుడు.

ఆలోచించాలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. నా కలుగును తవ్వి పారేయాలనుకున్నాడు. అంత పనీ చేశాడు. పలుగుతో నా కలుగు తవ్వేసి, అందులో నేను దాచుకున్న భోజన పదార్ధాలన్నీ తీసి విసిరేశాడు. దాచుకున్నదంతా పోయింది. తిండి కరువైపోయింది. తిండి లేక కృశించిపోయాను. నీరసించిపోయి తిరుగుతోంటే, నన్ను చూసి చూడాకర్ణుడు ఇలా అన్నాడు.

‘ చూడూ! డబ్బున్నవాడే బలవంతుడు. డబ్బున్నవాడే పండితుడు. డబ్బుంటేనే సుఖాలు. డబ్బంటే నీ దృష్టిలో తిండి. ఆ తిండి నీకు లేదు. నేను తీసి పారేశాను. దాంతో నువ్వు ఎలా అయిపోయావు? చిక్కి శల్యమయిపోయావు. అందుకే డబ్బుండాలంటారు. డబ్బు లేకపోతే దుబ్బుకి కూడా పనికిరారు. అన్నీ బాధలే! డబ్బుంటే పేరుంటుంది. పౌరుషం ఉంటుంది. తెలివితేటలూ, బంధు మిత్రులూ ఉంటారు. అదే డబ్బులేకపోతే ఇవేవీ ఉండవు. పేదరికం కంటే చావే మేలు. పేదరికంతో ఛస్తూ బతికేకంటే చావడం అంత గొప్ప పని ఇంకొకటి లేదు. ఆరోగ్యం పోయినా బతకొచ్చు. మాట పడిపోయినా బతకొచ్చు. పేరూ వూరూ పోయినా బతకొచ్చు. బుద్ధి మార్చుకోనంటూ మొండిగా బతకొచ్చు. కానీ, డబ్బు లేకుండా బతకడం చాలా కష్టం. ’ చూడాకర్ణుని మాటలకు ఎంతగానో ఏడ్చాను. ఉండలేకపోయానక్కడ.

చెప్పుకోలేని బాధ. డబ్బు పోగొట్టుకున్న సంగతీ, మనో వ్యథా, ఇంట్లో వాళ్ళ ప్రవర్తనా, మోసం, అవమానం ఇవేవీ నలుగురికీ చెప్పుకోలేం. దేవుని దయ లేనప్పుడు, పరిస్థితులు అనుకూలించనప్పుడు అభిమానవంతుడు ఉన్న ఊరినీ, కన్నతల్లినీ విడిచి వెళ్ళడం న్యాయమే! అభిమానం కలవాడు శిరస్సు మీద పువ్వులా ఉండాలి. లేదంటే అడవిలో పువ్వులా ఎండలో మాడి మసి అయిపోవాలి. బిచ్చమెత్తుకొని బతికేకంటే చావడం మేలు అనుకున్నాను. అయినా ఆశ చావలేదు.

ఉన్న ఇంటిని వదిలిపెట్టలేకపోయాను. పోగొట్టుకున్న చోటే సంపాదించుకోవాలని తాపత్రయపడ్డాను. ఆశ భ్రమల్ని రేపుతుంది. భ్రమలు దుఃఖాన్ని కలిగిస్తాయి. దుఃఖం మనిషిని నాశనం చేస్తుంది. అందుకే బుద్ధిమంతుడు ఆశకు అంటుకట్టడు. అని చెప్తూ తన గతాన్నంతా గుర్తు చేసుకోవడంతో కళ్ళు చెమర్చాయి హిరణ్యకుడికి. అతనలా కళ్ళు చెమర్చుకోవడాన్ని చూసి, లఘుపతనకుడూ, మంథరుడూ బాధగా ఒకరినొకరు చూసుకున్నారు.

ఈ కథలో నీతి ఏమిటో కామెంట్ లో తెలియజేయండి